Thursday, November 6, 2014


Poem by Turaga Janaki Rani, 2014. Published in Telugu Vidyarthi 

మెతుకు విలువ
ఒక పావురాన్ని చూచి తెలుసుకున్నాను

 నేను వేలికంటిందని దులిపేసిన ఎండు మెతుకును

 వెతకి, దులిపి కుక్షిలోకి వదలి

 క్షుద్బాధ బాపుకొన్న దృశ్యం చూచి

మెతుకు విలువ తెలుసుకున్నాను

అమ్మో! పారవేయొద్దు! ప్రోగు చేసి ముద్దుగా ముద్దగా చేసి పెట్టండి.

 ఎగిరెగిరి, కువకువలాడుతూ,

గుంపుగా, సంబరంగా వచ్చి, విందారగిస్తాయి

వానలొచ్చిన కాలాన, వరద ముంచిన ప్రళయాన,

కంకి జాలిగా నేలకొరిగింది పాపం!
నేల తల్లి వెచ్చటి మట్టిలో కలిసి,

బంగారమై భాసిల్లింది త్వరలోనే.

 పాలు పోసుకుని పొటమరించి

నిటారుగా నిలుచున్న కంకులై, గింజలై, అన్నమై,

 ఒక తల్లి కడుపులో సంపన్నమయి,

 క్షీరమై మన బొజ్జ నింపుతాయి.

 అదే ప్రాణాధారం, అదే జీవనాధారం.

 అన్నమే కదా అని పారవేయొద్దు.

అదే జీవగర్రయని తెలుసుకో.

 మెతుకు విలువ తెలుసుకో.